మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి భానోత్ శంకర్ నాయక్‌కు మద్దతుగా నేడు మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఒక్కటి కాదు.. 11 ఛాన్సులిచ్చినా ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటి పథకాలు రాష్ట్రంలో తప్పా మరెక్కడా అమలుకావడం లేదన్నారు. 2014 సంవత్సరానికి ముందున్న.. ప్రస్తుతం ఉన్న మానుకోటకు ఒక్కసారి బేరీజు వేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో మానుకోటను జిల్లాను చేసుకున్నామని, అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడైనా రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాల గురించి పథకాలు అమలు చేయాలనే ఆలోచన వారికి వచ్చిందా.. ? అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఆసుపత్రికి వెళ్లక పోయే వాళ్లమని.. కానీ ఇప్పుడు సర్కార్ ఆసుపత్రిలో ప్రసవం కావాలని పోతున్నారన్నారు. మానుకోటలో 100 పడకల ఆసుపత్రిని 365 పడకల ఆసుపత్రి చేసుకున్నామన్నారు. మహబూబాబాద్‌కు సీఎం కేసీఆర్ రూ.50కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించారన్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మానుకోట రూపురేఖలు మారిపోతాయన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో సిలిండర్ రేటును మూడింతలు పెంచిందని, మళ్లీ కట్టెల పొయ్యిపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పేదలు గ్యాస్ మీద వంట చేసినా కన్నీళ్లు వస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పేదలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దలు రావాల్సిందేనని.. మానుకోట అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ 24 గంటలు అందుబాటులో ఉండే శంకర్ నాయక్‌ను మరోసారి గెలిపించాలని కోరారు సత్యవతి రాథోడ్.