కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మీద ఎస్సి, ఎస్టి కేసు నమోదు చేయాలని, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో విఆర్ఓ శ్యామ్ కుమార్ ఫిర్యాదు చేసారు. కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ విఆర్ఓని మరియు రెవెన్యూ శాఖ అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన మీద ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులు మేడ్చెల్ కలక్టర్ వద్ద నిరసన కూడా తెలిపారు.
అయితే నిన్న గాజుల రామారం విఆర్ఓ శ్యామ్ కుమార్ ఎమ్మెల్యే వివేక్ తనపై దుర్భాషలాడారని పేర్కొంటూ ఎమ్మెల్యే వివేకానంద్ పై ఎస్.సి ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో ఆధారం గా కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే ఈ విషయం మీద వివేక్ వివరణ ఇచ్చారు. నిరుపేదల ఇండ్లను నిర్దాక్షిన్యంగా కూల్చివేస్తూ.. అడ్డు వచ్చిన గర్బిణీ మహళల, వికలాంగులపై దౌర్జన్యం చేసి చేయిచేసుకుంటూ.. కరెంటు మీటర్లను తీసుకెళ్లారని.. వారంతా తనను ఆశ్రయించారని తెలిపారు. రెవెన్యూ సిబ్బందిని తాను తిట్టిన మాట వాస్తవమేనన్న ఎమ్మెల్యే వివేక్.. అలాగే, రెవెన్యూ ఉద్యోగుల అవినీతి, అక్రమాలను ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.