లుక‌లుక‌లు.. గ్రూపు ఫైటింగ్‌ల‌తో అట్టుడుకుతోన్న వైసీపీ…!

-

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా కంట్రోల్ త‌ప్పేసింది. ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉన్న నేత‌ల‌తో పాటు కొత్త‌గా పార్టీలో చేరిన నేత‌ల మ‌ధ్య వార్ మామూలుగా లేదు. పార్టీ అధిష్టానం వార్నింగ్‌లు ఇస్తున్నా కూడా నేత‌లు లైట్ తీస్కొని రెచ్చిపోతున్నారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలాగే ఉంది. రోజు రోజుకు ఈ గొడ‌వ‌లు ఎక్కువ అవుతోన్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. గ‌న్న‌వ‌రం, చీరాల‌, ద‌ర్శి, విశాఖ ఇలా చెప్పుకుంటూ పోతే క‌ల‌హాల కాపురాల‌తో నేత‌లు ఫైట్ చేస్కొంటోన్న నియోజ‌క‌వ‌ర్గాల లిస్ట్ రోజు రోజుకు పెరిగిపోతోంది.


జ‌గ‌న్ సీఎం అయిన తొలి యేడాది పాటు పార్టీలో వ్య‌వ‌హారాల‌న్ని క్ర‌మ‌శిక్ష‌ణతోనే న‌డిచాయి. ఎప్పుడు అయితే ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ప్రారంభించారో అప్ప‌టి నుంచే వార్ మొద‌లైంది. ఎవ్వ‌రూ కూడా అధిష్టానాన్ని లెక్క‌చేసే ప‌రిస్థితి లేదు. స్వపక్షంలో విపక్షంలా బాహాబాహీకి దిగుతున్నారు. గ‌న్న‌వ‌రంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ సానుభూతిప‌రుడుగా మారిన ఎమ్మెల్యే వంశీకి ఆయ‌న‌పై గ‌తంలో రెండు ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన దుట్టా రామ‌చంద్ర‌రావు, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు వ‌ర్గాల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు.

దాదాపు ప్ర‌తి రోజు వీరి మ‌ధ్య వార్ న‌డుస్తూనే ఉంది. ఇక వంశీ అద్దె నాయ‌కుడు అని ఇక్క‌డ పాత వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక చీరాల‌లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ సానుభూతిప‌రుడు అయిన క‌ర‌ణం బ‌లరాంకు, ఎన్నిక‌ల్లో ఓడిన నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. క‌ర‌ణం అంటేనే రెచ్చ‌గొట్టే ధోర‌ణితో ఉంటారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు వెంక‌టేష్ సైతం అదే ధోర‌ణితో వ్య‌వ‌హరిస్తుండ‌డంతో పాటు వైసీపీ శ్రేణుల‌కు న‌చ్చ‌డం లేదు.

ఇక ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, ఎన్నికల్లో పోటీ చేయ‌ని మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ మ‌ధ్య ఉప్పు నిప్పులా వాత‌వ‌ర‌ణం నెల‌కొంది. ఇక విశాఖ‌లో ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ ఫ్యాన్ కింద‌కు రావ‌డంతో అక్క‌డ కోలా గోరువుల‌తో పాటు మ‌రో వర్గం నేత‌ల మ‌ధ్య రాజ‌కీయ చిచ్చు రాజుకుంది. ఇక నార్త్‌లో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, ప‌శ్చిమంలో టీడీపీ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు సైతం ఫ్యాన్ పార్టీ సానుభూతిప‌రులు అయితే అక్క‌డ కూడా పాత వైసీపీ నేత‌లు వ‌ర్సెస్ కొత్త నేత‌ల మ‌ధ్య వార్ మామూలుగా ఉండ‌దు. ఏదేమైనా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చేర్చుకోవ‌డంతోనే ఈ త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయ‌ని వారు ర‌గిలిపోతున్నారు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version