దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగున్న వేళ.. సింగరేణి కార్మికులు మాత్రం తమ విధులను నిర్వర్తిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన వారికి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించడానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తి కోసం వారు యథావిథిగా డ్యూటీలకు హాజరవుతున్నారు. అదే సమయంలో కరోనా పోరాటానికి తమ వంతు సాయం అందించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలకు సింగరేణి కార్మికులు, అధికారులు తమ ఒక్క రోజు వేతనం విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రూ. 8.5 కోట్ల విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నారు.
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణితోపాటు దేశంలోని ఇతర కోల్ మైన్స్ కూడా యథావిథిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.