వైసీపీ,టీడీపీ నేతల రహస్య ఒప్పందాలు

-

నువ్వో.. నేనో తేల్చేసుకుందాం.. రా అని పైకి సవాళ్లు విసురుతూ లోపల మాత్రం నీది తెనాలే-నాది తెనాలే అనే విధంగా సాగింది నిన్నటిదాక సిక్కోలు రాజకీయం.కానీ ఇప్పుడు ఒక్కసారిగా తెరవెనక రహస్య ఒప్పందాలకు చెక్ పెట్టి టార్గెట్‌ పాలిటిక్స్ కి తెరతీశారు ధర్మాన,కింజరాపు కుటుంబాలు. రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు టార్గెట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎంతసేపూ పార్టీ అధినేతలపై విమర్శలతో కాలక్షేపం చేసే నేతలు ఇప్పుడు లోకల్‌గా డైలాగ్ వార్‌కు దిగుతున్నారు.

గడిచిన ఐదేళ్లలో శ్రీకాకుళం రాజకీయం డిఫరెంట్ గా నడిచేది. వైసీపీ అధినేతను లక్ష్యంగా చేసుకుని మాటల దాడికి దిగేవారు టీడీపీ నేతలు. స్థానికంగా ఎంత మంది వైసీపీ నాయకులు ఉన్నా వారి జోలికి టీడీపీ నాయకులు వెళ్లేవారు కాదు. దీంతో తమను కాదు కదా అని జిల్లా వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉండేవారు. టీడీపీ-కాంగ్రెస్‌ మధ్య రాజకీయం నడిచిన రోజుల్లోనూ తీరు ఇలాగే ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది. మాటకు మాట అప్పజెప్పేస్తున్నారు.

ముఖ్యంగా విమర్శలు, ప్రతివిమర్శల విషయంలో ధర్మాన-కింజరాపు కుటుంబాల మధ్య ఓ అండర్‌స్టాండింగ్‌ ఉండేదనుకునేవారు. ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఇంటర్నల్‌ ఒప్పందాలు జరిగేవని టాక్‌. ఆ విధంగా ఎన్నికల సమయంలో కాళింగ-వెలమ సామాజికవర్గాలను వినియోగించుకుని రాజకీయ తంత్రం నడిపేవారట. ఈ రెండు కుటుంబాల నుంచి ఎవరు గెలిచినా.. ఎవరు అధికారంలో ఉన్నా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండేవారట. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్నా.. ధర్మాన ప్రసాదరావు కేబినెట్‌లో కొనసాగినా ఈ ఒప్పందం కొనసాగేదని సమాచారం. ఇప్పుడీ రహస్య ఒప్పందానికి తూట్లు పడ్డాయట.

2019 ఎన్నికల తర్వాత ధర్మాన ఫ్యామిలీ రూటు మార్చేసిందని చెవులు కొరుక్కుంటున్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌.. కింజరాపు కుటుంబ వారసులపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇటీవల అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జిల్లా టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచారు. బాబాయ్‌-అబ్బాయ్‌లకు స్థానిక వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నా.. డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ మాటల దాడి పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఏ చిన్న అవకాశం వచ్చినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడులపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నారు డిప్యూటీ సీఎం. వారు చేసే అవినీతి ఆరోపణలను తిప్పి కొడుతూనే.. దమ్ముంటే నిరూపించండి అని సవాల్‌ చేస్తున్నారట. మీ ఆస్తుల లెక్క మా ఆస్తుల లెక్క తీద్దాం రండి అని తొడగొట్టి మరి సవాల్ విసురుతున్నారట ధర్మన కృష్ణదాస్‌. దీంతో రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న ఇంటర్నెల్‌ పొలిటికల్‌ ఫార్ములాకు చెక్‌ పడిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటి నుంచైనా సిక్కోలు రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయో లేదో అనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version