ద్రౌపదికి ప్రత్యేకంగా ఆలయాలు, పూజలు.. ఎక్కడంటే?

-

సాధారణంగా మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే శివుడు, విష్ణువు, దుర్గాదేవి, వినాయకుడు, హనుమంతుడు.. ఇలా అందరు దేవుళ్లు, దేవతలకు చెందిన ఆలయాలు మనకు కనిపిస్తాయి. కానీ మీకు తెలుసా..? నిజానికి మన దేశంలో పలు చోట్ల పాండవులతోపాటు ద్రౌపదికి కూడా ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాల్లో వారికి పూజలు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే..?

బెంగళూరు నగరం మధ్యన ధర్మరాయ దేవాలయం ఉంది. ఇందులో పాండవులు, ద్రౌపదిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సందడి నెలకొంటుంది. అదే సమయంలో కరగ పండుగ పేరిట ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో తిగల వంశానికి చెందిన వారు నిర్మించారని చరిత్ర చెబుతోంది. బెంగళూరుకు అన్ని నగరాల నుంచి సులభంగా ప్రయాణం చేయవచ్చు. కనుక ఈ ఆలయాన్ని కూడా భక్తులు సులభంగా దర్శించుకోవచ్చు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు ఆలయానికి మధ్య దూరం సుమారుగా 36 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రైలు, రోడ్డు మార్గాల్లోనూ బెంగళూరుకు సులభంగా రావచ్చు కనుక.. ఆలయాన్ని సౌకర్యవంతంగా సందర్శించవచ్చు. ఆలయాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శించుకునేందుకు భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో యామిగాని పల్లెలో ధర్మరాజుకు ఆలయం ఉంది. ఇందులో ద్రౌపదిని కూడా పూజిస్తారు. ఒకప్పుడు బ్రిటిష్‌ వారు కూడా ఇక్కడ పూజలు చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పుత్తూరు సమీపంలోని చైటూరు గ్రామంలో ఆరుగురు అన్నదమ్ములు కలిసి బావి తవ్వగా అందులో ద్రౌపది విగ్రహం బయటపడింది. అదే రోజు రాత్రి వారిలో చిన్నవాడైన చినతంబికి ద్రౌపది కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరింది. దీంతో మరుసటి రోజు చినతంబి వెంటనే తన అన్నలకు ఈ విషయం చెప్పి అందరూ కలిసి విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో 18 రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. అందువల్ల ఆ సమయంలో భక్తులు ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ఆలయంలోని ద్రౌపదిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం తప్పక కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే భక్తులు ద్రౌపదిని ఇక్కడ సంతాన దేవత అమ్మవారిగా కొలుస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version