కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రిపుర పర్యటనలో భద్రతా వైఫల్యం జరిగింది. ఆయన కాన్వాయ్‌లోకి ఓ ప్రైవేట్ కారు వేగంగా దూసుకొచ్చింది. అమిత్ షా అగర్తల ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమిత్ షా బుధవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ముగించుకొని నిన్న సాయంత్రం గెస్ట్ హౌస్ నుంచి అగర్తల విమానాశ్రయానికి అమిత్ షా కాన్వాయ్ వెళ్తుండగా.. ఆ మార్గంలో అధికారులు సాధారణ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఓ వ్యక్తి మాత్రం ఆగకుండా తన కారులో ముందుకొచ్చాడు. పోలీసులు ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించినా అతడు వేగంగా కాన్వాయ్‌లోకి దూసుకురావడం కలకలం సృష్టించింది.
ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. మరోవైపు, ఈ ఘటనను కేంద్ర దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్లు సమాచారం.