ఏపీలో గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో ఆ పదవులు అధికారంలో ఉన్న వైసీపీకి దక్కాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్, నలుగురు కీలక నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు, గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన రమేష్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజులకు ఎమ్మెల్సీలు దక్కాయి. అయితే ఈ ఎమ్మెల్సీల ఎంపికపై రగడ జరుగుతుంది. ఇందులో ముగ్గురుపై కేసులు ఉన్నాయని ప్రతిపక్ష టీడీపీ చెబుతోంది.
వైసీపీ ప్రతిపాదించిన అభ్యర్ధుల్లో తోట త్రిమూర్తులుపై అనేక క్రిమనల్ కేసులు ఉన్నాయని, లేళ్ల అప్పిరెడ్డిపై కూడా కేసులు ఉన్నాయని, రమేష్ యాదవ్‌పై హత్య కేసు ఉందని రామయ్య లేఖలో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్సీల ఎంపిక అయిపోయింది కాబట్టి, వీటిల్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
కాకపోతే టీడీపీ రాజకీయం చేయడానికే గవర్నర్‌కు లేఖ రాసిందని, ఎందుకంటే గతంలో తోట త్రిమూర్తులు టీడీపీలోనే పని చేశారని, అప్పుడు ఆయన నేర చరిత్ర టీడీపీకి తెలియదా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అలాగే టీడీపీలో ఎమ్మెల్సీలుగా ఉన్న కొందరిపై కేసులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఎమ్మెల్సీల ఎంపిక పెద్ద రచ్చే అయింది.