దేశంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను 15 రోజుల్లోగా తమ తమ సొంతూళ్లకు పంపేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నుంచి 15 రోజుల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే వలస కార్మికులను తరలించేందుకు అదనపు రైళ్లను ఏర్పాటు చేయాలని, రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న మేరకు 24 గంటల్లోగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కష్టాలను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు విచారణ చేపట్టి మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, సంజయ్ కిషన్ కౌల్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. అలాగే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వలస కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
సొంతూళ్లకు వెళ్లాలనుకునే కార్మికుల వివరాలను సేకరించి వారిని రైలు లేదా రోడ్డు మార్గంలో తరలించాలని కోర్టు చెప్పింది. ఇప్పటి నుంచి 15 రోజుల్లోగా వలస కార్మికుల తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. ఇక ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు జూలైకి వాయిదా వేసింది.