ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సుప్రీం కోర్టు దేశంలో కొత్త వాహనాలైతే కేవలం బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే కరోనా వల్ల ఆ గడువును పొడిగించారు. కాగా బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన వాహనాలను వాడే వారికి కోర్టు కీలక సూచనలు చేసింది. ఇకపై ఆ వాహనాలపై గ్రీన్ స్టిక్కర్‌ను వేయాల్సి ఉంటుంది. అందుకు గాను అక్టోబర్ 1వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ తరువాత ఆ వాహనాలపై ఎట్టి పరిస్థితిలోనూ గ్రీన్ స్టిక్కర్ కనిపించాలి.
బీఎస్ 6 ప్రమాణాలను పాటించే వాహనాలకు చెందిన నంబర్ ప్లేట్ పై భాగంలో 1 సెంటీమీటర్ పొడవైన గ్రీన్ స్ట్రిప్ ఉండాలి. ఇది ఆ ప్రమాణాలు కలిగిన వాహనాలను తేలిగ్గా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అయితే గ్రీన్ స్టిక్కర్‌ను వాహన తయారీ కంపెనీలు వేసి ఇస్తాయా.. వాహనదారులే వేసుకోవాలా.. అన్న విషయంలో స్పష్టత రాలేదు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
దేశంలో ప్రస్తుతం కొత్త బీఎస్ 4 వాహనాలకు గాను రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. కరోనా నేపథ్యంలో వాహన డీలర్ల విజ్ఞప్తి మేరకు కోర్టు కొన్ని రోజులు ఇందుకు అదనంగా గడువు ఇచ్చింది. అయితే దీనిపై కూడా స్పష్టత లేదు. కానీ బీఎస్ 6 వాహనాలు వాడే వారు మాత్రం పైన తెలిపిన విధంగా తమ వాహనాలపై గ్రీన్ స్టిక్కర్‌ను వేసుకోవాల్సి ఉంటుంది.