బాలీవుడ్ నటుడు, దూరదర్శన్‌లో వచ్చిన సుప్రీం హీరో ‘శక్తిమాన్’ ధారావాహికతో ప్రాచుర్యం పొందిన ముకేశ్‌ఖన్నా (64) వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. బీఆర్ చోప్రా తీసిన ‘మహాభారత్’ సీరియల్‌లోనూ భీష్మ పితామహుడి పాత్రతో పేరు తెచ్చుకొన్న ఈ నటుడు యువతుల విషయమై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
‘నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించరు. ఒకవేళ యువకులతో అలా ఎవరైనా అమ్మాయిలు మాట్లాడారంటే.. వారు వేశ్యలే’ అని ముకేశ్‌ఖన్నా వ్యాఖ్యానించారు. ‘భీష్మ్ ఇంటర్నేషనల్’ పేరిట ఉన్న తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు బుధవారం ఉదయానికి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
దీనిపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో.. ‘నేను సాధారణ స్త్రీ, పురుష సంబంధాలను దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడలేదు. నా అసలు ఉద్దేశం సెక్స్ మోసాల గురించి యువతను చైతన్యపరచడమే’ అని ఆయన వివరణ ఇచ్చారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడిన ముకేశ్‌ఖన్నాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా దిల్లీ మహిళా కమిషన్ సైబర్ సెల్ పోలీసులకు నోటీసు పంపింది.