వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మం వేదికగా జరిగే బహిరంగ సభ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయబోతున్నారు . తండ్రి మాజీ సీఎం వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ గడ్డపై కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఈమె ప్రకటించబోయే పార్టీ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటు ప్రజలతో పాటు అటు రాజకీయ పార్టీలు కూడా వైఎస్ షర్మిల సభని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే ఖమ్మంలో జరిగే సంకల్ప సభలో పార్టీ పై షర్మిల ఎలాంటి ప్రకటన చేస్తారు..పార్టీ జెండా ఎజెండా ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిరేపుతుంది.
లోటస్ పాండ్‌లో వరుసగా తెలంగాణ జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి రాజకీయాల్లో షర్మిల ఓ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఖమ్మం సంకల్ప సభతో షర్మిల ఏం చెబుతారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతుంది. షర్మిల పార్టీ వెనుక టీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా అన్న అంశాల పై ప్రజల మధ్యలో షర్మిలా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న విషయం ఖమ్మం వేదికగా స్పష్టత ఇవ్వనున్నారు షర్మిల. ఖమ్మంలో జరుగుతున్న సంకల్ప సభకు షర్మిల తల్లి విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఇక షర్మిల పార్టీ పేరు పై కూడా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. వైఎస్ఆర్ ఇమేజ్ ను తెలంగాణలో తన పార్టీకి రాబట్టుకునేలా షర్మిల అడుగులు ఉంటున్నాయి. అందుకే ప్రతీ సమావేశంలోనూ రాజన్న ఉండి ఉంటే ఏఏ పథకాలు ఉండేవో వల్లె వేస్తూ వస్తున్నారు షర్మిల. వైఎస్ఆర్టీపీ,వైఎస్ఆర్ పార్టీ,రాజన్న రాజ్యం ఇలా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఖమ్మంలో పార్టీ ప్రకటన మాత్రమే ఉంటుందని పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండా మరో రెండు నెలల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు షర్మిల సభలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. లక్షమందితో సభ నిర్వహించాలని షర్మిల భావించినా కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆరు వేలమందికి పర్మీషన్ ఇచ్చారు పోలీసులు.
ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతు వచ్చిన ఖమ్మం సభను ఈరోజు నిర్వహించడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కావడం. తెలంగాణలోనే ఎందుకు పార్టీ పెట్టాలనుకున్న విషయం పై షర్మిల తన ప్రసంగంలో స్పష్టత ఇవ్వనున్నారు. తెలంగాణలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉండటం..ఆంధ్రా కల్చర్ కి దగ్గరకు దగ్గరగా ఉండటంతో ఈ సభకు ఖమ్మంను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.