అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సరైన గుర్తింపు లేదని రాజయ్య యాదవ్ ఆరోపించారు. కెసిఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని అన్నారు. టిఆర్ఎస్ లో ఉన్నంతకాలం బాధే మిగులుతుందన్నారు రాజయ్య. పార్టీలో ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరూ అసంతృప్తితోనే ఉన్నారని తెలియజేశారు.
తనతో పాటు మరికొందరు పార్టీ వీడెందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ళ నుంచి సీఎం కేసీఆర్ తో కలిసి నడిచిన నేతగా రాజయ్య యాదవ్ కు మంచి గుర్తింపు ఉంది. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్ట్ అయి ఖమ్మం జైలులో కేసీఆర్ తో కలిసి ఉన్న నేతల్లో రాజయ్య యాదవ్ కూడా ఒకరు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు రాజయ్య యాదవ్.