ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన సిని పరిశ్రమకు లాభమా నష్టమా… ఇప్పుడు దీనిపై భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. జగన్ నిర్ణయం విషయంలో రాష్ట్రంలో ప్రజలు కూడా సందిద్గ్డంలో ఉన్నారు. కర్నూలు హైకోర్ట్, విశాఖలో సచివాలయం అనే సరికి చాలా మందికి ఇప్పుడు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు సిని పరిశ్రమకు మాత్రం ఇది కలిసి వస్తుందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
వాస్తవానికి విశాఖకు హైదరాబాద్ తో సమానంగా పేరుంది. కొన్ని కారణాల వలన విశాఖలో కొంత అభివృద్ధి అనేది ఆగిపోయింది. అయితే అక్కడ సినిమాను మాత్రం ప్రజలు ఎప్పుడు ఆదరించారు. సినిమా కార్యక్రమాలకు అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉంటుంది. చాలా మంది హీరోలు తమ సినిమాలను అక్కడే పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. విశాఖ నేపధ్యంలో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అంటే, అక్కడి ప్రజల స్పందన ఆధారంగా చూస్తే, సినిమా అక్కడికి వెళ్తే మంచి ఆదరణ ఉంటుంది.
స్టూడియో నిర్మాణాలను కూడా భారీగా చేపట్టే ఆలోచనలో సిని పెద్దలు ఉన్నారు. చిరంజీవి కూడా అక్కడకు అడుగు పెట్టారు. ఇతర హీరోలు కూడా అక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రవాణా సౌకర్యం కూడా ఎక్కువగానే ఉంది. అమరావతిలో చాలా వరకు అవకాశాలు తక్కువగా ఉండటంతో సిని పరిశ్రమ దృష్టి సారించలేదు. కాని ఉత్తరాంధ్రలో అవకాశాలు చాలా వరకు ఎక్కువ. అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, షూటింగ్ కి అనువైన ప్రదేశాలు ఉండటంతో, ఆంధ్రాలో షూటింగ్ చేయవచ్చు. దీనితో ఆంధ్రాలో అడుగు పెట్టడానికి జగన్ నిర్ణయం అనేది సిని పరిశ్రమకు కలిసి వచ్చిన అంశం. విశాఖ మినహా సిని పరిశ్రమకు మరో అనువైన మార్గం ఆంధ్రప్రదేశ్ లో లేదు. అక్కడే సినిమాలను పూర్తి చేసే అవకాశం కూడా ఉండటంతో ఖర్చులు కూడా సినిమా నిర్మాణాలకు తగ్గే అవకాశం ఉంది.