హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు గోరింటాకు పెట్టుకుని ఉంటారు. అసలు గోరింటాకు ఎందుకు అంటే పెద్దలు పలు కథలు చెప్తారు. గోరింటాకు ఎలా పుట్టిందంటే పెద్దలు చెప్పేది, ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది…
గోరింటాకు పుట్టుక
గౌరి ఇంటి ఆకు….అది కాస్తా గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏ ఉపయోగం కలదూ అని అడుగుతుంది. అపుడు పార్వతి (గౌరి) ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ చేయ్యి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుందీ అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది. స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది.
అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది. అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు. ఆషాఢమాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట.
గోరింటాకు లాభాలు
ఏది ఏమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు, ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగ ప్రమాదాన్ని నివారించవచ్చని పెద్దల అనుభవం. ఇక ఆలస్యమెందుకు ఈ రోజు గోరింటాకు తెచ్చుకుని చేతులను అందంగా మార్చుకోండి.
– కేశవ