కరోనా వైరస్ ప్రభావంతో 90 శాతం మంది ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో నెట్ వినియోగం కూడా పెరిగింది. ముఖ్యంగా జనాలు సోషల్ మీడియాతోపాటు వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. అయితే కొందరు ఇండ్లలో ఉండే వైఫై ఎక్కువగా సిగ్నల్ రావడం లేదని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన పలు చిట్కాలు పాటిస్తే.. వైఫై సిగ్నల్‌ను పెంచుకోవచ్చు. దీంతో ఇంటర్నెట్ మరింత ఎక్కువ దూరం వస్తుంది. స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వైఫై సిగ్నల్‌ను పెంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* సాధారణంగా చాలా మంది 802.11n లేదా 802.11g స్పెసిఫికేషన్ ఉన్న వైఫై రూటర్‌ను వాడుతుంటారు. అయితే అవి కాకుండా 802.11ac స్పెసిఫికేషన్ ఉన్న రూటర్‌ను వాడితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది. దీంతో వైఫై రేంజ్ ఎక్కువగా వస్తుంది.
* ఇంట్లో కొందరు వైఫై రూటర్లను కిటికీల వద్ద పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇంటికి సరిగ్గా మధ్య భాగంలో రూటర్‌ను పెట్టాలి. దీంతో వైఫై అన్ని వైపులా వస్తుంది.
* కొందరు వైఫై రూటర్లను బాగా ఎత్తులో పెడతారు. అలా కాకుండా మధ్యస్థంగా ఉండేలా వాటిని పెట్టాలి. దీంతో వైఫై సిగ్నల్ మెరుగవుతుంది.
* ఇండ్లలో మైక్రోవేవ్ ఓవెన్లు ఉండేవారు.. వాటిని ఆఫ్ చేయాలి. వాటి వల్ల వైఫై సిగ్నల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక ఓవెన్లను ఆఫ్ చేస్తే వైఫై సిగ్నల్ కొంత వరకు పెరుగుతుంది.
* స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వద్ద కూడా రూటర్లను పెట్టరాదు. వాటితో వైఫై సిగ్నల్ తగ్గుతుంది. వాటికి దూరంగా రూటర్లను ఉంచితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది.
* మార్కెట్‌లో మనకు వైఫై సిగ్నల్‌ను పెంచే బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని పెట్టుకోవడం ద్వారా కూడా వైఫై సిగ్నల్ పెంచుకోవచ్చు.