విజయనగరంలో శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈసారి కాస్త ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా.. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 3 లాంతర్లు మీదుగా కోట వరకు మూడు సార్లు సిరిమాను ఊరేగింపు జరిగింది. ప్రతి ఏడాది విజయదశమి అనంతరం తొలి మంగళవారం విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. ఆలయం నుంచి మూడు లాంతర్ల సెంటర్ మీదుగా కోట వరకు మూడు పర్యాయాలు సిరిమాను ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు, ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
కాగా, సిరిమానోత్సవం సందర్భంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. సిరిమానోత్సవం సందర్భంగా ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నారు.