ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఆయనకు ఎవరు జై కొడుతారు? ఎవరు నై అంటారు అనేదే ఇప్పుడు వస్తున్న లెక్కలు. ఇక ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు మౌనంగానే ఉంటున్నారు. కానీ ఈరోజు కాస్త ఓపెన్ అయ్యారు. జై ఈటల నినాదాలతో హోరెత్తించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ వర్సెస్ ఈటల వర్గాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా సభలు, సమావేశాలు పెడుతూ హోరెత్తిస్తున్నారు. అయితే ఈసారి కాస్త ఎక్కువగా రెచ్చిపోయారు ఈటల వర్గీయులు.
వీణవంకలో ఈ రోజు ఎమ్మెల్సీ నారదాసు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ నారదాసు మాట్లాడుతూ పార్టీ గురించి వివరించారు. పార్టీ లైన్ ఎవరూ దాటొద్దని, ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ వెంటే ఉండాలంటూ చెప్పారు. అయితే ఆయనకు షాక్ ఇచ్చారు టీఆర్ ఎస్ నేతలు. ఈటల రాజేందర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘జై’ ఈటల అంటూ పెద్ద ఎత్తున హంగామా చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని ఈటల వర్గీయులను బయటకు పంపారు.