జనసేన పార్టీలో కొన్ని అరాచక శక్తులు చేరి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.దెందులూరు నియోజకవర్గంలో జరిగిన టీడీపీ,జనసేన పార్టీ నేతల మధ్య గొడవపై ఆయన ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరాయన్నారు. రాజకీయ పబ్బం కోసమే వాళ్లు జనసేనలో చేరారని ఆరోపించారు.
చేరినవాళ్లు చేరినట్టు ఉంటే చాలా మంచిదని, పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటి? అని ప్రశ్నించారు. గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని హెచ్చరించారు.ఎన్నికల టైంలో కూటమి ఓటమికి ప్రయత్నించింది కూడా వారేనన్నారు.ఇప్పుడు పార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదన్నారు. ఈ విషయంపై జనసేన అధినాయకత్వంతో మాట్లాడుతామని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. కాగా, ఏలూరు జిల్లా దెందులూరు సెగ్మెంట్ పైడిచింతపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూటమి టీడీపీ నేతలను పిలవకుండా ఏకపక్షంగా పెన్షన్ల పంపిణీ చేయడంతో టీడీపీ,జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలసిందే.