అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది. ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు.
అయితే ఇది ప్రధానంగా గుహ దేవాలయంగా ఉంది. ఇది సంవత్సరంలో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే కనిపించే శివలింగం. ఏడాదిలో 45 రోజుల మాత్రమే ఉండే మంచు లింగాన్ని చూసే భాగ్యం దక్కుతుంది. ఈ శివలింగం స్వయంగా మంచుగడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది. ఈ ఆలయం వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ శివలింగాన్ని దర్శించుకొనుటకు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు వేసవిలో అమర్నాథ్‌కు తరలి వస్తారు.
40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచ భూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు.
ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్‌నాథ్ యాత్ర ఇప్పుడు ‘భయ’భక్తుల మధ్య సాగుతోంది. ఆ ధవళమూర్తి దర్శనానికి భద్రతా దళాల పహారా అవసరం అవుతోంది. తాజాగా ఉగ్రదాడితో కలకలం మొదలైనా.. శివయ్య దర్శనానికి మాత్రం భక్తులు వెనుకంజ వేయడం లేదు. భారమంతా ఆలయకారుడి మీద వేసి వ్యయప్రయాసల కోర్చి యాత్ర కొనసాగిస్తున్నారు.