ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నేతలపై వైసీపీ నేతల దాడి చేసిన ఘటనపై ఏపీ బీజేపీ చీప్ స్పందించారు. రాజకీయ పార్టీల ప్రస్థానం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ట్విటర్ వేదికగా తెలిపారు. భౌతిక దాడులతో బల నిరూపణ కంటే.. ప్రజా తీర్పు అనేది రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఇలాంటి అనైతిక దాడులను.. ప్రజలు గమనించాలని ట్విటర్‌లో సోమువీర్రాజు పేర్కొన్నారు. సోము వీర్రాజుతో పాటు.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ధర్మవరంలో బీజేపీ నేతలపై వైసీపీ వాళ్ళు దాడి చేయడం అధికార పక్షం దౌర్జన్యాలను వెల్లడిస్తోందన్నారు.
ప్రెస్‌క్లబ్‌లో అందరూ చూస్తుండగా దాడికి తెగబడ్డారంటే దాష్టీకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం అవుతోందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్హించాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే నేర ప్రవృతి కలిగిన నాయకులు పేట్రేగిపోతారని నాదెండ్ల మనోహర్ అన్నారు.