ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అన్నీ హిందూ ఆలయాల గురించి వాటి దాడుల గురించే జరుగుతున్నాయి. ఆలయాలపై జరిగిన దాడుల వెనుక టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తముందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిది. గౌతమ్ సవాంగ్ ఒక పొలిటీషియన్ మాదిరి మారిపోయాడని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన చదివినవన్నీ సజ్జల రాసిచ్చిన పేర్లే అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక తాజాగా డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సోము వీర్రాజు లేఖ రాశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కేసులో తమ పార్టీ బీజేపీ కార్యకర్తల హస్తమన్నట్లు ప్రకటించారని దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన ప్రకటన వల్ల మీడియాలో బీజేపీ కార్యకర్తలే దాడులు చేసినట్లు వార్తలు ప్రచురితమవుతున్నాయని పేర్కొన్న సోము వీర్రాజు ఈ వివాదంతో బీజేపీ కార్యకర్తలకు సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆధారాలు చూపలేని పక్షంలో పార్టీ పరువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేసినందున పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.