దేశవ్యాప్తంగా అనేక రైళ్లలో ఇప్పటికే భారతీయ రైల్వే అనేక సదుపాయాలను ప్రయాణికులకు అందిస్తూ వస్తోంది. టిక్కెట్లను కొనుగోలు చేయడం దగ్గర్నుంచీ రైలు ప్రయాణం చేసి గమ్య స్థానం చేరే వరకు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే అనేక సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై రైళ్లలో స్మార్ట్ విండోలను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేయవచ్చు.
న్యూఢిల్లీ నుంచి హౌరా మధ్య నడుస్తున్న రాజధాని రైలులో ఏసీ1 కోచ్‌లో స్మార్ట్ విండోలను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే రిజర్వేషన్ ఉన్న ట్రైన్లకు ఈ విండోలను ఏర్పాటు చేయాలని రైల్వే భావిస్తోంది. ఈ ప్రత్యేకమైన కిటికీల వల్ల రైలులో ఉండే ప్రయాణికులకు పూర్తి ప్రైవసీ ఉంటుంది. లోపల ఉన్నవారికి బయటి భాగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ బయట ఉన్నవారికి రైలులో ఏముందో కనిపించదు. దీంతో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు.
కాగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్ సదుపాయాన్ని అందించాలని రైల్వే భావిస్తోంది. అందుకు గాను ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ విషయం బడ్జెట్ సమావేశాల్లో తెలిసే అవకాశం ఉంది. ఇక రెడీ టు ఈట్ మీల్స్‌కు గాను రైల్వే ఇప్పటికే హల్దిరాం, ఐటీసీ, ఎంటీఆర్, వాగ్ బక్రీ వంటి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై త్వరలో వివరాలు తెలుస్తాయి.