వచ్చే యేడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ అనేక రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. బలంగా ఉన్న తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ధీటుగా ప్రజల్లో ఛరిష్మా ఉన్న నేత కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పాఠశాల నిర్మాణానికై తృణమాల్ ప్రభుత్వం తనకిచ్చిన స్థలాన్ని
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరిగి ఇచ్చేశారు.
దీంతో గంగూలీ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని.. ఆయనను బీజేపీ బెంగాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని.. అయితే గంగూలీని సీఎం అభ్యర్థిగా ఇప్పటికిప్పుడు ప్రకటించకపోయినా ఎన్నికలకు ముందు ఈ ప్రకటన ఉంటుందని జాతీయ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల గంగూలీ పాఠశాలను నిర్మిస్తానని చెప్పడంతో బెంగాల్ ప్రభుత్వం రెండెకరాల స్థలం ఇచ్చింది. అయితే తాజాగా గంగూలీ తాజాగా మమతను ఆమె కార్యాలయంలో కలిసి ఈ రెండెకరాల స్థలం ఇచ్చేశారని తెలుస్తోంది.
గంగూలీ ముందు నుంచి కూడా బీజేపీతో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. 2019లో ఆయన బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేందుకు నేటి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు సాయం చేశారన్న టాక్ ఉంది. ఇక కొద్ది నెలల నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి గంగూలీ వస్తాడన్న ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు గంగూలీ ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థే అన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. గంగూలీ గతంలో తాను మంచి క్రికెటర్‌గా ఆదరణ పొందానని.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఖండించినా… తాజా పరిణామాలతో గంగూలీ పేరు బెంగాల్ రాజకీయాల్లో మార్మోగుతోంది.