కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది ఎన్నో దేశాల్లో చిక్కుకుపోయారు. భారతీయులు అనేక దేశాల్లో చిక్కుకుపోగా, ఇతర దేశీయులు కొందరు మన దేశంలోనే ఉండి పోయారు. ఈ క్రమంలోనే స్పెయిన్‌కు చెందిన ఓ మహిళ కూడా మన దేశానికి టూరిస్టుగా వచ్చి లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయింది. ఆమెకు తన భారతీయ స్నేహితులు ఆతిథ్యం ఇచ్చారు. దీంతో ఆమె ప్రస్తుతం ఇక్కడే వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది.
స్పెయిన్‌కు చెందిన ట్రెసా సొరియానో అనే 34 ఏళ్ల మహిళ స్పెయిన్‌లోని వలెన్షియా అనే సిటీ నుంచి మార్చి నెలలో భారత్‌కు వచ్చింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయింది. కర్ణాటకలోని కుందాపూర్ ప్రాంతం హెరాంజల్ అనే గ్రామంలో ఉన్న ఆమె స్నేహితుడు కృష్ణ పూజారి ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. అయితే అంతర్జాతీయ విమానాలు ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యే సూచనలు కనిపించకపోవడంతో ట్రెసా హెరాంజల్ విలేజ్‌లోనే ఉంటూ వ్యవసాయం చేస్తోంది.
స్థానికంగా ఉన్న మహిళలతో కలిసి ట్రెసా నిత్యం పొలం పనులకు వెళ్తోంది. ఆవులకు పాలు తీస్తోంది. నదిలో చేపలు పడుతోంది. రంగవల్లికలు వేయడం, కొబ్బరిపీచుతో చీపుర్లు తయారు చేయడం నేర్చుకుంటోంది. ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ.. తన ఇండియన్ ఫ్రెండ్ ఉండబట్టి బతికిపోయానని, లేదంటే తనకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి ఉండేవని, తన ఫ్రెండ్ తల్లిదండ్రులు తనను సొంత కూతురిలా చూసుకుంటున్నారని, ఇండియన్స్ అంటే తనకు ఎంతగానో ఇష్టం ఏర్పడిందని ఆమె చెబుతోంది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైతే తిరిగి స్పెయిన్‌కు వెళ్లే ముందు ఒక్కసారి గోవా వెళ్తానని చెప్పింది.