ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్థిత్వ పరిరక్షణ, వనరులు, నాయకులు, న్యాయమైన వాటాను విధాన నిర్ణేతలు, కష్టపడి పని చేసే ప్రజలకు ప్రభుత్వం గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది యువత తన ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అమరులైన వారికి నివాళులర్పించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలు పోరాటం చేశారన్నారు. ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు. యువత, విద్యార్థుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందన్నారు.