తొలి వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 180 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (76) అర్ధశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (35), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23) ఫర్వాలేదనిపించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షమీ అద్భుతమే చేశాడు. చివరి ఓవర్లో 11 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో.. ఎవరూ ఊహించని విధంగా మహమ్మద్ షమీకి బంతిని అందించాడు రోహిత్. అప్పటి వరకు మ్యాచ్‌లో లేని షమీ.. ఆ ఓవర్లో అద్భుతమే చేశాడు. తొలి రెండు బంతులకు నాలుగు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి కమిన్స్ సిక్సర్ బాదేందుకు చూశాడు. అయితే లాంగాన్‌లో ఉన్న కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ చేర్చాడు. సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ అందుకున్న క్యాచ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.
తర్వాత బాల్ కి స్పెషలిస్ట్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (1)కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు ఆష్టన్ అగర్ (0) తన వికెట్ త్యాగం చేశాడు. అతన్ని రనౌట్ చేసిన షమీ.. ఆ తర్వాత వేసిన అద్భుతమైన యార్కర్‌కు ఇంగ్లిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో వచ్చిన కేన్ రిచర్డ్సన్ను కూడా సూపర్ యార్కర్‌తో అవుట్ చేశాడు షమీ. దీంతో 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు ఆరు పరుగుల తేడాతో తొలి వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది.