కోవిడ్ 19కారణంగా ఐపీఎల్ 2021వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సగంలోకి వచ్చిన టోర్నమెంట్, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆటగాళ్ళు సహా సహాయ సిబ్బంది కరోనా బారిన పడడంతో మరో మార్గం లేక వాయిదా వేయాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం వాయిదా పడ్డ ఐపీఎల్, సెప్టెంబరులో జరగనుందని అంటున్నారు. దుబాయ్ వేదికగా ఈ టోర్నమెంట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఈ విషయమై బీసీసీఐ నుండి స్పష్టమైన నివేదిక రానప్పటికీ సెప్టెంబరులో టోర్నెమెంట్ మొదలయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో అంశం చర్చలోకి వచ్చింది. నిజానికి ఐపీఎల్ లో కేవలం 8జట్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో జట్టు మరో జట్టుతో రెండు రెండు మ్యాచులు ఆడతాయి. అంటే మొత్తం 14మ్యాచులు. ఇలా ఒక్కో జట్టు 14మ్యాచులు ఆడుతూ అంతులేని వినోదాన్ని ప్రేక్షకులని అందిస్తున్నాయి. ఆ వినోదాన్ని మరింత పెంచడానికి అన్నట్టు బీసీసీఐ మరో రెండు జట్లని కలపాలని ప్రయత్నిస్తుంది. మరో రెండు ఫ్రాంఛైజీలు 2022లో వస్తాయని వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా వార్తల్లో ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రక్రియని బీసీసీఐ నిలిపివేసిందని తెలుస్తుంది. ఇప్పుడప్పుడే మరో రెండు ఫ్రాంఛైజీలను తీసుకొచ్చే ప్రణాళికలు లేవని, వచ్చే ఏడాది నాటికి పది జట్ల ఐపీఎల్ వచ్చే అవకాశం లేదని వినబడుతుంది. ఐపీఎల్ 2021టోర్నమెంట్ ముగిసిన తర్వాత జరిగే వేలానికి మరో రెండు ఫ్రాంఛైజీలను ప్లాన్ చేసే వీలు లేదని సమాచారం. కరోనా పూర్తిగా తగ్గిపోయి పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పది జట్ల ఐపీఎల్ చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరేం జరుగుతుందో!