ఐపీఎల్ 2023 సీజన్-16ను గుజరాత్ విజయ ఢంకా మోగిస్తూ ఆరంభించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో షురూ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో చేసిన తప్పిదమే తమ ఓటమికి కారణమైందని సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. తేమ ప్రభావం ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్‌లో అదనంగా పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘డ్యూ ఉంటుందని మా అందరికీ తెలుసు. అయినా మేం బ్యాటింగ్‌లో అదనంగా పరుగులు చేయలేకపోయాం. 15-20 పరుగులు ఎక్కువ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. బంతి సరిగ్గా టైమ్ చేశాడు. అతని బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంది. అతడు ఆడిన విధానం, ఎంచుకున్న షాట్లు ఆకట్టుకున్నాయి. రుతురాజ్‌లా యువ ఆటగాళ్లు సత్తా చాటడం చాలా ముఖ్యం. మా బౌలర్లు కొన్ని తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇద్దరు లెఫ్టార్మర్స్ ఉండటం బెటర్ ఆప్షన్ అనుకున్నా. అందుకే ఇద్దర్నీ తీసుకున్నా.’ అంటూ ధోనీ చెప్పుకొచ్చాడు.