ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్‌కు మరికొద్ది గంటల్లో తెర తీయనున్నారు. ఈ క్రమంలోనే ఆరంభ మ్యాచ్ ఏప్రిల్ 9వ తేదీన ముంబై, బెంగళూరుల మధ్య చెన్నైలో జరగనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్‌కోహ్లి వివో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడ్డాడు. అతన్ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వివో తెలియజేసింది. ఈ క్రమంలోనే వివో చేపట్టబోయే పలు ఈవెంట్లతోపాటు ప్రచార కార్యక్రమాల్లోనూ త్వరలో కోహ్లి కనిపించనున్నాడు. అయితే ఎంత మొత్తానికి కోహ్లి అంగీకరించాడనేది తెలియలేదు. కానీ ఇరువురి మధ్య భారీ డీల్ కుదిరినట్లు తెలిసింది.
కాగా అక్‌నాలెడ్జ్ అనే వెబ్‌సైట్ తెలిపిన నివేదిక ప్రకారం విరాట్ కోహ్లి ఆస్తి విలువ రూ.688 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అతనికి బీసీసీఐ, ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ.24 కోట్ల వేతనం లభిస్తోంది. ఇవి కాకుండా ఆడి, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, హీరో మోటోకార్ప్, ప్యుమా, ఊబర్, వాల్వొలైన్ వంటి కంపెనీలకు కూడా కోహ్లి ప్రచారకర్తగా ఉన్నాడు. దీంతో అతను ఏటా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
కాగా వివోతో ఒప్పందం చేసుకున్న సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ వివో లాంటి సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుండడం సంతృప్తిగా ఉందని అన్నాడు. ఆటలో నిలకడైన ప్రదర్శనను కొనసాగించడం ఎంత ముఖ్యమో టెక్నాలజీలోనూ ఆ విధమైన వ్యవహారశైలిని అనుసరించడం కూడా ముఖ్యమేనని అన్నాడు. వివో ఈ విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుందన్నాడు.