టీ20 ప్రపంచకప్‌లో అమెరికాను ‘సూపర్ 8’కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు టీ20 హీరో అయిపోయాడు. ఎక్కడ చూసినా ఇప్పుడు చర్చంతా ఈ ప్లేయర్ గురించే. ఒరాకిల్ ఏఐ ఇంజినీర్ అయిన ఈ ప్రవాస భారతీయ ఐటీ ఇంజినీర్‌ను పలువురు క్రికెటర్లతోపాటు.. సహోద్యోగులు కూడా అభినందిస్తున్నారు. అతడి ఆటతీరును మెచ్చుకుంటూ ఒరాకిల్ సంస్థ ట్వీట్ చేసింది.
‘టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చరిత్ర సృష్టిస్తోంది. మన ఏఐ ఇంజీనిర్, క్రికెట్ స్టార్ సౌరభ్ నేత్రావల్కర్ ఆట పట్ల ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘నా టెక్ కెరీర్‌తోపాటు క్రికెట్ అభిరుచిని కొనసాగించేందుకు మద్దతునిచ్చిన ఒరాకిల్‌కు కృతజ్ఞతలు’’ అంటూ నేత్రావల్కర్ కూడా వెంటనే స్పందించాడు. ఈ ట్వీట్స్ కాస్త వైరల్ కావడంతో పలువురు టెకీలు అతడి ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు కూడా పంపారు. అతడితో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించకూడదని, సెలవులు పొడిగించాలని కోరారు. మరికొందరుఅతడి జీతాన్ని 60 శాతం పెంచాలని అడిగారు.