శ్రీలంకవాసులకు ‘షాక్‌’.. 264 శాతం విద్యుత్‌ ధరలు పెంపు

-

తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అధిక ధరలు, విద్యుత్‌ కోతలతోపాటు నిత్యవసరాలు, ఇంధనం, ఔషధాల వంటి కొరతతో సతమతమవుతోన్న శ్రీలంకవాసులకు మరో ‘షాక్‌’! గృహావసరాలకు నెలకు 30 కిలోవాట్లలోపు విద్యుత్‌ ధరలను 264 శాతం పెంచుతున్నట్లు ఇక్కడి ప్రభుత్వ ఆధీనంలోని ‘సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌’ మంగళవారం ప్రకటించింది.

అదే నెలకు 180 కిలోవాట్లకు మించి వినియోగించేవారికి 80 శాతం మేర పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు విద్యుత్‌ ధరల పెంపు తొమ్మిదేళ్లలోనే ఇది మొదటిసారి. బుధవారం నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.ఇదిలా ఉండగా.. సీఈబీ ఇప్పటికే భారీ నష్టాల్లో ఉంది. ఈ క్రమంలోనే పేరుకుపోయిన 616 మిలియన్‌ డాలర్ల నష్టాల్లో కొంత మేర రాబట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వాస్తవానికి 800 శాతం కంటే ఎక్కువ ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని సీఈబీ కోరింది. కానీ.. గరిష్ఠంగా 264 శాతానికి అనుమతి దక్కిందని అధికారులు తెలిపారు. తాజా పెంపుతో.. నెలకు 90 కిలోవాట్ల కంటే తక్కువ విద్యుత్‌ వాడుతున్న 78 లక్షల పేద కుటుంబాల్లో మూడింట రెండొంతులు ప్రభావితమవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ చిన్న వినియోగదారులకు యూనిట్‌కు 2.50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.

తాజా పెంపుతో ఇది ఎనిమిదికిపైగా చేరుకోనుంది. అదే నెలకు 180 కిలోవాట్లకు మించి వినియోగించేవారు యూనిట్‌కు 45 రూపాయల చొప్పున చెల్లిస్తుండగా.. ఇప్పుడది సుమారు 75కి చేరుకోనుంది. ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో విద్యుత్‌ రంగానికి కష్టాలు ఎదురవుతున్నాయి. థర్మల్ జనరేటర్ల కోసం ఇంధనం కొనుగోలు చేయలేని పరిస్థితి. ఫలితంగా.. స్థానికంగా కరెంటు కోతలు నిత్యకృత్యమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version