సరైన విధానం, సిద్ధాంతం లేని పార్టీ ఏదైన ఉందంటే..అది తెదేపానే అని భాజపా తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మార్చి గాంధీ భవన్ అని పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయాల వల్ల ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆయన విమర్శించారు. కర్నాటక తరహాలో తెలంగాణలో రాజకీయం చేయాలని ఎంఐఎం చూస్తోందని అది ఎన్నటికీ నెరవేరదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణలో అధికారం ఏర్పాటు చేయడంలో భాజపా కీలక పాత్ర పోషించనుందని శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.