తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరవీరుడు శ్రీకాంతా చారి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా హరీష్ రావు స్పెషల్ ట్వీట్ చేశారు. మంగళవారం శ్రీకాంతా చారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. దీనిపై అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు అని కీర్తించారు.
అలాగే కేసీఆర్ అరెస్టును, ఉద్యమ కారులపై ప్రభుత్వ అణిచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి వర్ధంతి సందర్భంగా నివాళి అంటూ.. ‘జోహార్ శ్రీకాంతాచారి’ అని నినదించారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న శ్రీకాంతా చారి 2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.