కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం అనేక కార్యకలాపాలకు ఇప్పటికే ఆంక్షలను సడలించింది. అందులో భాగంగానే సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు విమానాల్లో తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. దేశంలో పలు నగరాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టులలో భిన్నమైన రూల్స్‌ను పెట్టి ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే జాగ్రత్త చర్యలను పాటిస్తూ విమాన ప్రయాణం చేయాలని.. ఎయిర్‌పోర్టులు, విమానయాన సంస్థలు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం చెప్పింది. కానీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ నిబంధనలతోపాటు పలు భిన్నమైన రూల్స్‌ను అమలు చేస్తున్నాయి. వాటి గురించి ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఉండడం లేదు. దీంతో తీరా వారు ఎయిర్‌పోర్టులో దిగాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశంలో సోమవారం నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. పలు చోట్ల ఇప్పటికే సిటీలకు చేరుకున్న ప్రయాణికులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన భిన్నమైన రూల్స్ తెలియిక ఎయిర్‌పోర్టులలోనే ఎక్కువ సమయం పాటు నిరీక్షిస్తున్నారు. అయితే ఆ రూల్స్ గురించి తమకు ముందుగానే తెలియజేస్తే బాగుండేదని, ఇలా చేయడం వల్ల ఎంతో సమయం వృథా అవుతుందని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేయడం వల్ల ప్రస్తుతం విమాన ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.