కరోనా లాక్‌డౌన్ కారణంగా ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు ముగియనున్న వాహనదారుల వాహన ధ్రువపత్రాల గడువును జూలై 31వ తేదీ వరకు పెంచినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతంలో ఈ గడువును తొలుత మార్చి 30, తరువాత ఏప్రిల్, మే వరకు పెంచారు. ఇక ఇప్పుడు ఈ గడువును జూలై 31వ తేదీ వరకు పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎక్స్‌పైర్ అయిన వాహన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అవి జూలై 31వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు.
కాగా వాహన ధ్రువపత్రాల గడువు ముగిసినప్పటికీ వాటిని వాహనదారులు రెన్యువల్ చేసుకుంటే ఎలాంటి అదనపు రుసుమును కూడా వసూలు చేయబోమని అధికారులు తెలిపారు. మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1988 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్‌పైర్ అయిన వాహన డాక్యుమెంట్లు కలిగిన వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.
ఇక వాహనపత్రాలను రెన్యువల్ చేసే సమయంలో సాధారణ ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన పనిలేదు. జూలై 31వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నిబంధనలను మారుస్తారు.