హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న స్టీల్‌ బ్రిడ్డి

-

హైదరాబాద్​లో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాహనదారులపై ఆ భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం అనేక చోట్ల వంతెనల నిర్మాణాలను చేపడుతూ వస్తుంది. ఆ కోవలోకి చెందిందే ఈ వంతెన. హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనున్న ఇందిరాపార్కు- వీఎస్టీ స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.450 కోట్లతో 2.6 కిలోమీటర్లు నిర్మించిన అతిపెద్ద ఉక్కువంతెన పనులు ఇటీవల పూర్తికావడంతో లోడ్‌ టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం వచ్చే పది రోజుల్లోగా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెన వాడుకలోకి వస్తే ఎన్టీఆర్‌ జంక్షన్‌, అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, బాగ్‌లింగంపల్లి జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

ప్రతిపాదిత ప్రాంతంలో రహదారి ఇరుకుగా ఉండటంతో స్టీల్‌ బ్రిడ్జి ఉత్తమమని ఇంజినీర్ల బృందం అభిప్రాయపడింది. అదనంగా భూమిని సేకరిస్తే.. వందల భవనాలు కూల్చాల్సి వచ్చేది. వేల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది. దీంతో ఉక్కు వంతెన వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణ పనులకు 2020 జూలై 10న శంకుస్థాపన జరగగా.. సాంకేతిక కారణాలతో 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి.హైదరాబాద్‌లోని మెట్రోరైలు పై భాగాన నిర్మితమైన మొదటి వంతెన కావడం మరో ప్రత్యేకత. ఈ స్టీల్ వంతెనను 4 లైన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి 12,316మెట్రిక్‌ టన్నుల ఉక్కును వినియోగించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఉక్కు వంతెనలో 81 స్టీల్‌ పిల్లర్లు, 426 దూలాలు నిర్మించినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ఈ ఉక్కు వంతెన ఏర్పాటు వల్ల.. వాహనదారులకు వ్యయప్రయాసలను తగ్గించగలదని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version