విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే.. ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలు ప్రశంసించారని గుర్తు చేసారు. విజయవాడ సమీపంలోని కొడపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలలో అమిత్ షా మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏవిధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడు జరిగిన విధ్వంసం గురించి చింతించకండి. ఏపీ అభివృద్ది కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ అండదండలు ఉన్నాయి. మోడీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తాం అని తెలిపారు. ఆరు నెలల్లో ఏపీకి రూ.3లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని తెలిపారు. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు ప్రకటించామని తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెల్తామన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిని బుట్ట దాఖలు చేసింది. 2028లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తామని తెలిపారు.