ఆస్తి కోసం సవతి దారుణానికి ఒడిగట్టింది. కూతురును చంపి నదిలో పాతిపెట్టింది. 4 నెలల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకివెళితే.. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన పీనా నాయక్‌కు 30 ఏళ్ల కింద వివాహం అవ్వగా ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుండి కూతురు మహేశ్వరి తండ్రి దగ్గరే పెరిగింది.
అనంతరం 2003లోనే పీనా నాయక్, లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.ఈమెకు ఒక కూతురు ఉంది.కూతురు మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి, ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. అక్కడ పరిచయం అయిన యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకోగా, కొంతకాలానికి విభేదాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత కూతురు మహేశ్వరి రెండో వివాహం కోసం తండ్రి భారీగా డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు.
బోడుప్పల్‌లో తనకున్న రెండు ఇండ్లలో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు.దీంతో ఆస్తి పోతుందని సవతి తల్లి లలిత..తన మరిది సీఆర్పీఎఫ్ జవాన్ బానోత్ రవి, అతడి స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు. గతేడాది డిసెంబర్ 7న ఉద్యోగ పనులపై పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయం చూసి ఈ ముగ్గురు మహేశ్వరిని చంపి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసి నదిలో పూడ్చి పెట్టారు. పీనా నాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతురు వేరే అతనితో వెళ్లిపోయిందని, ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భార్య లలిత నమ్మించింది.దీంతో మౌనంగా ఉన్న పీనా నాయక్ 4 నెలలవుతున్నా కూతురు జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో మహేశ్వరిని ఆస్తి కోసం చంపినట్టు సవతి తల్లి అంగీకరించగా, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.