కొందరు వ్యక్తులు తరచూ పంటి నొప్పి సమస్యతో బాధ పడుతుంటారు. దీంతో వారు ఎంతో ఇష్టంగా తినాలని అనుకునే ఆహారాన్ని కూడా భుజించరు. పుప్పిళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం, దంతాలు ఊడటం వంటి పంటి నొప్పి నొప్పి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. పుప్పిళ్లు వంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే పంటినొప్పి, చిగుళ్లకు వాపు రావడం వంటి సమస్యలను ఇంట్లో చిట్కాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించవచ్చని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. సహజ పద్ధతులతో పంటి సమస్యను ఎలా పరిష్కరిస్తారో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.
వెల్లుల్లితో..
పంటి నొప్పి సమస్యను తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో యాంటి బయోటిక్ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి సమస్య నుంచి తొందరగా ఉపశమనాన్ని అందిస్తాయి. బాగా దంచిన వెల్లుల్లిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి కప్పి పంటినొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే నొప్పి తగ్గుతుంది. తినే ఆహారం కొన్నిసార్లు దంతాల్లోనే ఇరుక్కుపోతుంది. అలా దంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌తో పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాంటప్పుడు గోరువెచ్చటి నీటిలో కాసింత ఉప్పు వేసి.. ఆ నీటిని నోట్లో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి.. నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా పంటినొప్పి వస్తుంటుంది. అలాంటి సమయంలో పలుచటి గుడ్డ తీసుకొని అందుటో ఐస్ ముక్కలు వేసుకోవాలి. పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఐస్ ముక్కలతో నెమ్మది ఒత్తాలి. అలా చేసినప్పుడు పంటి నొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది.
లవంగాలతో..
లవంగాలతో కూడా పంటినొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు. పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగాన్ని కొంచెం సేపు పెట్టి ఉంచాలి. అలా చేస్తే నొప్పి నుంచి కొంత ఉపశమనం దొరుకుతుంది. అలాగే చిగుళ్లలో నొప్పి ఏర్పడినప్పుడు ఆవాలు నూనెలో చిటికెడు ఉప్పు తీసుకుని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిగుళ్ల నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేయాలి. ఇలా చేస్తే కూడా పంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అయితే, పంటినొప్పి ఉన్నప్పుడు తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. పంటినొప్పి అనిపించినప్పుడు 4, 5 పుదీనా ఆకులను నొప్పి ఉన్నప్రాంతంలో పెడితే.. కొంతమేర ఉపశమనం దొరుకుతుంది.