ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాజ్యసభ సభ్యులు నలుగురు బిజెపిలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆ నలుగురు కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో జరిగిన ఈ పరిణామం కార్యకర్తలను ఆవేదనకు గురి చేసింది. అది పక్కన పెడితే అప్పటి నుంచి ఢిల్లీ లో ఎక్కువగా ఉంటున్న ఎంపీలు తెలుగుదేశం పార్టీని బిజెపికి దగ్గర చేసేందుకు గాను ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
ఈ సమయంలోనే కాస్త వైసీపీ బిజెపి మధ్య గ్యాప్ అనేది మొదలయింది. ఇప్పుడు రాజధాని వ్యవహారంలో కూడా సుజనా చౌదరి జోక్యం చేసుకున్నారు. ఆయన వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విశాఖను రాజధానిగా అడ్డుకోవడానికి గాను సుజనా చౌదరి కేంద్ర పెద్దలతో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉన్న సుజనా కు చుక్కలు చూపిస్తున్నారు.
దాదాపు నాలుగు రోజుల నుంచి ప్రధానికి ఫిర్యాదు చేయడానికి గాను సుజనా చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి విజయసాయి అడ్డు పడుతున్నట్టు తెలుస్తుంది. తనకు సన్నిహితంగా ఉండే కేంద్ర మంత్రుల ద్వారా సుజనా ప్రయత్నాలు చేస్తుండగా విజయసాయి తన పరిచయాలతో చక్రం తిప్పుతున్నారు. అమిత్ షా ని కలవడానికి సుజనా ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. దీనితో చంద్రబాబు రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు సన్నిహితంగా ఉండే కేంద్ర మంత్రితో మాట్లాడారని తెలుస్తుంది.