ఇండియాపై పాక్‌ ట్రోలింగ్ కు సుందర్ పిచాయ్‌ స్ట్రాంగ్ రిప్లై

-

టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిపై టీమ్‌ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లు క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ప్రదర్శనను ప్రశంసిస్తూ.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్ చేశారు.

‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. నేను కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లను ఈ రోజు మళ్లీ చూసి దీపావళి వేడుకలు చేసుకున్నా. అద్భుతమైన గేమ్‌.. టీమ్‌ఇండియా అత్యద్భుత ప్రదర్శన’’ అని పిచాయ్‌ రాసుకొచ్చారు.

ఈ ట్వీట్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఓ నెటిజన్‌ స్పందిస్తూ రోహిత్‌ సేనపై విమర్శలు చేసే ప్రయత్నం చేశాడు. ‘‘సుందర్‌ పిచాయ్‌ను ఉద్దేశిస్తూ.. మీరు మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది’’ అంటూ తొలి మూడు ఓవర్లలో టీమ్‌ఇండియా తడబడిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే అక్కడ నెటిజన్‌ ఏ జట్టు ఆడిన ఇన్నింగ్స్‌ అనేది క్లియర్ గా చెప్పకపోవడంతో ఈ ట్రోల్‌కు సుందర్‌ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘అది కూడా చూశా.. భువీ, అర్ష్‌దీప్‌ నుంచి అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్‌’’ అంటూ బదులిచ్చారు.

ఆ తర్వాత సదరు ట్విటర్‌ యూజర్‌ తాను టీమిండియా ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతున్నానని మరో ట్వీట్‌ చేసినా నెటిజన్లు అతడికి చురకలంటించారు. ‘‘అంత గొప్ప వ్యక్తి నీ ట్వీట్‌కు స్పందించడమే గొప్ప విషయం’’.. ‘‘పిచాయ్‌ సర్‌ మీరు సూపర్‌’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version