ఎడిట్ నోట్ : మ‌న‌ల్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేరు బంగారం

-

ఫ‌స్ట్ కాజ్ : మ‌హా న‌గ‌రాల్లోనే కాదు చిన్న చిన్న ప‌ల్లెల్లోనూ….

ప్రేమ పేరిట ప‌ర‌మ ద‌రిద్రం న‌మోదు అవుతోంది.

అవ‌న్నీ చూశాక ఈ ఆదివారం ప్రేమ క‌థ మీకోసం.ప్ర‌త్యేక‌మో ! సామాన్య‌మో !

వానల్లేవ్ కానీ ప్రేమ‌లున్నాయ్
ప్రేమ‌లతో కూడిన పాటలున్నాయ్
కొన్నంటే కొన్ని నీతి కోల్పోయిన
క‌థ‌లు ఉన్నాయి వాటికి రంగుల పుస్త‌కంలో
చోటిస్తే మార్కెట్ లో అదే మోస్ట్ సేల‌బుల్ ఫ్యాక్ట‌ర్
ఆదివారం ఆరంభంలో దొరికిన నీతి కాదు కాదు
మురికి.. అని రాయాలి.
మురికిని వ‌దిలించుకోవ‌డం బాధ్య‌త
మురికిని మంచి అనుకోవ‌డం భ్ర‌మ
గుర్తింపుల్లో ఉన్న తేడాలు క‌ళ్ల‌కు కాదు హృదయానికి మాత్ర‌మే
తెలుస్తాయి..తెలియాలి కూడా !
లోకంలో స్వ‌చ్ఛం అనుకున్న‌వి ఏవీ లేవు క‌నుక కాలంలో కూడా
కొంత కల్తీ ఉంది. అదిప్పుడు నివార‌ణ‌లో లేదు. నియంత్రితం కాదు.

టీనేజీ ప్రేమ‌లు – టేక్ ఇట్ ఈజీ ప్రేమ‌లు.. కాలేజీ ప్రేమ‌లు క్యాంప‌స్ ఫైర్ వ‌ర‌కూ ప్రేమ‌లు.. ప‌బ్బుల్లో ప్రేమ‌లు ఇంటి గుట్టు ర‌ట్ట‌య్యేదాకా ప్రేమ‌లు. ఇల్లీగ‌ల్. అయ్యో వాంతి ఇల్లీగ‌ల్ … అయ్యో భ్రాంతి.. ఏం చేయ‌లేం. చుట్టూ ఇంత‌టి చీక‌టి ఉంది క‌దా ! సిగార్ పొగ‌ల ధూళిలో కొట్టుకుపోవ‌డ‌మే ! అనైతికం కానీ అనైతికం అన‌గా అదే నైతికం కావొచ్చు బ్రో ! ఆదివారం ప్రేమ క‌థ‌ల్లో నీతి ఏమీ ఉంద‌దు. అస‌లు కథ‌కు నీతి ఆపాదించ‌డ‌మే ఓ గొప్ప ద‌రిద్రం. ప‌ర‌మ ద‌రిద్రం అని రాయాలి. నీఛం మ‌రియు నికృష్టం కూడా ! ఏదో ఒక‌టి అనుకుని తీరండి. మీ  మీ జీవితాల్లో ప్రేమ‌కూ శృంగార సంబంధ చ‌ర్య‌ల‌కూ ఉన్న ద‌గ్గ‌ర సంబంధం దూరపు సంబంధం ఏంట‌న్న‌ది ఎవ‌రికి వారే క‌దా తెలుసుకోవాలి. క‌నుక తెలుసుకోండి.

స్వ‌చ్ఛం అయిన ప్రేమ‌లు, స్వేచ్ఛని మిస్ యూజ్ చేయ‌ని ప్రేమ‌లు, వీధి ప్రేమ‌లు, కాలేజీ ప్రేమ‌లు ఉన్నాయా? ఆహా ! ఓ ఆటోవాడితో ప్రేమ, చ‌దువుకు వె ళ్తూ వెళ్తూ  పిల్ల ప‌డిపోయింద‌ట్లే ! ఏం కాదు కాస్త చూసుకుని న‌డువ‌మ్మా !  ప‌బ్బుల్లో ప్రేమ చ‌దువు అయిపోయినాక చేసుకునే ఫేర్వెల్ పార్టీ మార్వెల్ సినిమా సీక్వెల్ రేంజ్ లో చేసుకోవాల‌న్న‌ది ప‌ద‌హారేళ్ల బాలిక తాప‌త్ర‌యం కావొచ్చు. కాక‌పోనూ వ‌చ్చు. ఇంటెన్ష‌న్ ఏమ‌యినా ఇప్పుడున్న సొసైటీలో న‌డుస్తున్న సిల‌బ‌స్ ఇదే ! ఏం కాదు గుడ్డి త‌నం ఒక‌టి కంటికి అంటించుకుని తిరిగితే చాలు. అప్పుడు య‌వ్వ‌న ప్రాయంలో ఉన్న గాడి త‌ప్పిన ప్రేమ‌లను ప‌ట్టించుకోలేం. చూడలేం. కొన్ని సార్లు చెవిటిత‌నం  మంచిదేన‌ట ! అంధం అయిన వాటిని బ‌దిరం అయిన వాటిని జీవితాన పెంచుకుంటూ వెళ్లాలి. స‌మాజం బంగారాలు చుట్టూ తిరుగుతుంది. అస‌లు బంగారం మాత్రం అంద‌కుండా పోతోంది. ఇప్పుడేమంటావు బంగారు అని తొక్క తీసి అర‌టి పండు నోట్లో పెట్టే ఉంటుంది ఆ మీసాల సీసాల రైట‌రుకు.

ఆటోలో ప్రేమ క‌థ‌లు చ‌దివేను. ప్రేమ అనే పేరుతో తిరుగాడిన ప్రేమని ప్రేమ అని చెప్ప‌డం ప్రేమ‌కు ద్రోహ‌మో అన్యాయ‌మో చేసిన వాళ్లం అవుతాం. స్వ‌చ్ఛ‌మ‌యిన భావ ధార క‌న్నా భావ దారిద్ర్యం మ‌న క‌వుల్లోనూ , మ‌న సమాజంలోనూ ఉంది. ఇంగితం కోల్పోయిన రాత, ఇంగితం కోల్పోయిన మ‌నుష్యుల స‌మూహాల నుంచి ఈ ఆదివారం  కొంత మిన‌హాయింపు తీసుకుని తీరాలి.
అప్పుడు ఆదివారం బాగుంటుంది. పరీక్ష రాయ‌డానికి వీధి చివ‌ర కాలేజీకి వ‌చ్చిన జంట‌ను చూశాను. అబ్బో ఐటీఐ పూర్తి చేసిన  కుర్రాడికి ఇంట‌ర్ చ‌దువు పూర్తి చేసి డిగ్రీ కొచ్చిన పిల్ల‌కు ఈడు మ‌రియు జోడు కుదిరింది.

ఏం చేయాలి రోడ్డు పైనే రొమాన్స్. ఇవీ ఇవాళ్టి ప్రేమ కథ‌లు. వీటిని చ‌దివి విని విసిగిపోయిన వారంతా మాకెందుక‌ని త‌ప్పుకుంటూ పోతున్నారు. తల్లీ తండ్రీ ఇవేవీ ప‌ట్టించుకోకుండానే కాలం గ‌డిపేస్తున్నారు. విష‌యం తెలిస్తే అయ్యో మాకు తెలియ‌దే అని అంటారేంటో ! పిల్ల‌ల పెంప‌కం అన్న‌ది ఇవాళ స‌వాల‌క్ష స‌వాళ్ల‌తో ముడిప‌డి ఉంది. అనైతికత అన్న‌ది పిల్లల్లోనే కాదు పేరెంటింగ్ లోనూ ఉంది.

ప్రేమ ఆదివారంతో మొద‌ల‌యి ఉంది. ప్రేమ వ‌చ్చే ఆదివారం వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. ఈ రోజుల్లో ప్రేమ‌కు ఇంత‌కుమించి స్పాన్ లేదు క‌దా! ఉన్నా కూడా వాటిని ప్రేమ అని పిల‌వ‌డం మానుకోవాలి. ఎందుకంటే సిస‌లు ప్రేమ ఇలా ఉంటే ఒప్పుకోని జ‌నం ఉన్నారే ! రివ‌ర్స్ లో చెప్తాండాను ! అవును వారం ప్రేమ నెల ప్రేమ ఏడాది పాటు ప్రేమ ఏడాదంతా ప్రేమ త‌రువాత..మ‌నుషులు ఇంత‌టి  నిజాయితీ కోల్పోయి ఉన్నారు క‌నుక ప‌రీక్ష‌లు ముగియ‌గానే పిల్ల‌ల ప్రేమ‌లో ఆటోలో ఆటోగ్రాఫ్ల‌తో ముగిసిపోతున్నాయి. ఏవో కొన్ని హ‌ద్దులు దాటాకా ముద్దుల గోల ముగిశాక ప్రేమ కాలేజీలోకి వెళ్తోంది. అక్క‌డ ప్రేమ గురించి సంబంధిత ర‌గ‌డ గురించి వేరే చెప్పాలా ? క‌నుక పిల్ల‌లు ప‌బ్లిక్ గా ప్రేమించుకుంటూ ప‌బ్బుల్లో హ‌గ్గులు ఇచ్చుకుంటూ పెగ్గులు పంచుకుంటూ పోతుంటే త‌ల్లిదండ్రులు ఏం చేస్తున్నార‌ని ?

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Exit mobile version