ఏపీ బీపీ : దువ్వాడ ఇలాకాలో మూడో ముఖం ! ఇన్ ఫ్రంట్ థ‌ర్డ్ ఫ్రంట్

-

ఇన్ ఫ్రంట్ థ‌ర్డ్ ఫ్రంట్.. అవును ! ఇది నిజ‌మే కావొచ్చు ! వివాదాస్ప‌ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో మూడో ముఖం తెర‌పైకి రానుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తోంది. ఇప్ప‌టిదాకా పేరాడ తిల‌క్, దువ్వాడ శ్రీ‌ను మ‌ధ్య మాత్ర‌మే పోటీ అనుకుంటే, ఇప్పుడు మ‌రో కొత్త ముఖం యాద‌వ సామాజిక‌వర్గం నుంచి వ‌స్తోంది. శ్రీ‌కాకుళం జిల్లా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న గుర్నాథ్ యాద‌వ్ బ‌రిలో రేప‌టి వేళ ఉండ‌నున్నారు. అధిష్టానం టికెట్ ఇవ్వ‌కుంటే, అదే టెక్క‌లి నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు. ఈ నేప‌థ్యంలో టెక్క‌లి రాజ‌కీయాలు పూర్తిగా మారిపోనున్నాయి.

…..అచ్చెన్న వెర్స‌స్ దువ్వాడ
ఆగేనా యుద్ధం సాగేనా సంరంభం

వాస్త‌వానికి ఇప్ప‌టిదాకా దువ్వాడ శ్రీ‌ను అనే వివాదాస్ప‌ద నేత ప్ర‌తిసారీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (టెక్క‌లి నియోజ‌క‌వర్గం) ను తిట్ట‌డంతోనే కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ మ‌రియు విమ‌ర్శ. కార్య‌క‌ర్త‌ల నుంచి నాయ‌కుల వ‌ర‌కూ వైసీపీలో వినిపించే మాట ఇదొక్క‌టే ! టీడీపీ హ‌యాంలో విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల కార‌ణంగా వ‌చ్చిన ఇబ్బందులేంటో చెప్ప‌కుండా నీ అంతు తేలుస్తా గుడ్డ లిప్పి కొడ‌తా లాంటి క‌ఠిన ప‌ద‌జాలంతో మాట్లాడ‌డ‌మే త‌ప్ప దువ్వాడ ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేం లేదు అని ఇప్ప‌టికే నిర్థార‌ణ అయిపోయింది. వైసీపీ అధిష్టానం కూడా అచ్చెన్న‌ను టార్గెట్ చేయ‌డం మానుకుంది. వ‌ద్ద‌నుకుంది.

అయినా కూడా దువ్వాడ మాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. గొంతుక‌లో తీవ్ర స్వ‌రం త‌గ్గించ‌డం లేదు. దువ్వాడ‌కు ప‌క్క‌నే ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ప‌లాస‌లో కానీ, అటు ప‌క్క‌నే ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఇచ్ఛాపురంలో కానీ ఎక్క‌డా మంచి స్నేహాలు అయితే పెద్ద‌గా లేవు. సొంత సామాజిక‌వ‌ర్గం కాళింగుల ఖాతాలో కూడా ఆయ‌న‌కు మంచి స్నేహాలు లేవు. గ‌తంలో త‌న గ్రానైట్ వ్యాపారాల‌పై టీడీపీ స‌ర్కారు దెబ్బ‌కొట్టింద‌ని ఒకే ఒక్క అక్క‌సుతో అచ్చెన్న‌ను టార్గెట్ చేస్తున్నారాయ‌న. మ‌రి! ఆయ‌న్ను అన‌గా దువ్వాడ‌ను వ్య‌తిరేకించిన నందిగాం మండ‌లం,స‌వ‌ర నీలాపురంలో లో కూడా గ్రానైట్ త‌వ్వ‌కాలు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయే ! వాటిపై ఎందుకు మాట్లాడ‌రు. ? ఇదే ప్ర‌శ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. క‌నుక దువ్వాడ రాజ‌కీయ భ‌విష్య‌త్ అగ‌మ్య గోచ‌రంగా ఉన్న నేప‌థ్యంలో తెర‌పైకి మ‌రో కొత్త ముఖం రావ‌డం టెక్క‌లి రాజ‌కీయంలో ఇప్పుడు న‌మోదుకు నోచుకున్న కీల‌క మలుపు.

Read more RELATED
Recommended to you

Exit mobile version