దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎస్.బాబ్డేతో కూడిన ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసులో ఎలాంటి వాదనలు జరగకుండానే రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రిటైర్డ్ జడ్జీ ఢిల్లీ నుంచే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తారని పేర్కొంది. మరోవైపు.. న్యాయమూర్తుల పేర్లతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. అలాగే ఈ విచారణపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణా ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది.
కాగా, రేపటికి ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ప్రతివాదులుగా చేర్చారు.