మాజీ సీఎం చంద్రబాబుకు పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ చెవిలో జోరీగా మాదిరిగా తయారయ్యారు. ఒకప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించించడంతో పాటు నాటి సమైక్య రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డిని ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే జేసీ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో మాట పూర్తిగా మార్చేశారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని… వైసీపీ ని… పొగుడుతూ చంద్రబాబుకు ఝులక్‌ల మీద ఝులక్‌లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీ నేత,ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. నిజానికి జెసి ఎప్పుడేం మాట్లాడినా అది న్యూసే. ఆయన మాటలు సెన్సేషనే. అలాంటి జెసి దివాకర్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలను ఇరకాటంలో పడేశారు.
ముఖ్యమంత్రి జగన్ దమ్మున్న నేత అని… ఆయన ఎంతో గట్స్ ఉన్న నేత అని జేసీ కితాబిచ్చారు. తాను ఏం చేయాలనుకున్నా జగన్ ధైర్యంగా చేసి పడేస్తారని… ఆరోగ్య శ్రీ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని జెసి బుధవారం నాడు అసెంబ్లీ ఆవరణలో కామెంట్లు చేశారు. ఓ వైపు అసెంబ్లీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై జగన్, వైసీపీ వాళ్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి టైంలో అదే అసెంబ్లీ దగ్గర జేసీ జగన్‌ను పొగడడం బాబుకు ఇరకాటమే అని చెప్పాలి. అక్కడితో ఆగని జేసీ జగన్ ఎదురైతే తప్పకుండా అభినందిస్తానని అన్నారు. ఆరోగ్య శ్రీ ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పిన జెసి, జగన్ ఆరు నెలల పాలన చాలా బాగుందని మెచ్చుకున్నారు.