ఎన్ని స్కామ్​ల కేసులు సరిగ్గా తేల్చారు.. ఈడీ, సీబీఐలకు సుప్రీం ప్రశ్న

-

ఆర్థిక కుంభకోణాల్లో ఇప్పటి వరకు ఎన్ని కేసులు సరిగ్గా తేల్చారో చెప్పాలని ఈడీ, సీబీఐలకు సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించింది. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ఒడిశాకు చెందిన ఓ ఆర్థిక కుంభకోణంపై దాఖలైన పిటిషను విచారణ సందర్భంగా ఇలా నిలదీసింది. సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాతపూర్వక సమాధానం ఇచ్చేందుకు గడువు కోరినపుడు న్యాయమూర్తులు సీబీఐ, ఈడీలపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

“మాకు తెలిసినంతవరకూ.. ఆర్థిక కుంభకోణాల్లో కేసుల విచారణలు సీబీఐ, ఈడీల చేతికి వచ్చినపుడల్లా ఆలస్యమే. ఏళ్లతరబడి సాగదీస్తారు. ఇప్పటిదాకా ఎన్ని ఆర్థిక కుంభకోణాల కేసులను సరిగ్గా తేల్చారో మాకు చెప్పండి? మీకు కేసుల భారం ఎక్కువగా ఉండవచ్చు. సిబ్బంది సరిపడా లేకపోవచ్చు. మీకు సరైన వ్యవస్థ లేకపోవచ్చు. సీబీఐ అధికారులంతా ఎక్సైజ్‌, కస్టమ్స్‌ శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చినవారే. వారికి విచారణల గురించి తెలియదు. దీనిపై మళ్లీ వాయిదాలు ఉండవు. సోమవారం విచారిస్తాం. తీవ్రంగా పరిగణించండి. మరింత అప్రమత్తంగా ఉండాలని మీ అధికారులకు చెప్పండి. శనివారం నాటికల్లా సమాధానం ఏమిటో తెలియజేయండి” అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version