దేశంలోని పేదలు తమకు నచ్చిన చోట రేషన్ సరుకులు తీసుకునేలా ఒకే దేశం ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్) పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెల్సిందే. అయితే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం అమలుకు సంబంధించి సుప్రీం కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కీమ్‌ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశిస్తూ జూలై 31వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్దేశించింది.
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అమలుపై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కూడా పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి ఒక పోర్టల్ రూపొందించి జూలై 31వ తేదీలోగా దానిని అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాల వలస కార్మికులకు రేషన్ జారీ చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
రైట్ టు ఫుడ్ అనేది ప్రాథమిక హక్కు అని గుర్తు చేసిన ధర్మాసనం.. కోవిడ్ మహమ్మారి వేళ ఎవరూ ఆకలితో ఉండకూడదని వ్యాఖ్యానించింది. దీని కోసం కమ్యూనిటీ కిచెన్‌లను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం ద్వారా.. రేషన్ కార్డు లబ్దిదారులు దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనైనా రేషన్ సరుకులు తీసుకునే వీలు ఉంటుంది. కాగా తెలంగాణ సహా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే.