ధోనీతోపాటే రిటైర్ ఎందుకు అయ్యాడో ఎట్ట‌కేల‌కు తెలిపిన సురేష్ రైనా

-

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 ఆరంభం సంద‌ర్బంగా భారత క్రికెట్ జ‌ట్టు మాజీ వికెట్ కీప‌ర్ ధోనీతోపాటు బ్యాట్స్‌మ‌న్ సురేష్ రైనా వెంట వెంట‌నే రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే ధోనీ రిటైర్ అవుతాడ‌ని అప్ప‌టికే అభిమానులు ఊహించారు కానీ రైనా రిటైర్మెంట్ క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్‌ను క‌లిగించింది. ధోనీ రిటైర్మెంట్‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే రైనా కూడా క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు తెలిపాడు. కానీ తాను ఎందుకు రిటైర్మెంట్ తీసుకుంటున్న‌దీ రైనా అప్ప‌ట్లో వెల్ల‌డించ‌లేదు. కానీ ఆ విష‌యంపై తాజాగా అత‌ను నోరు విప్పాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంట‌ర్వ్యూలో రైనా త‌న రిటైర్మెంట్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ధోనీ రిటైర్మెంట్ ను ప్ర‌క‌టించిన వెంట‌నే తాను కూడా రిటైర్మెంట్ ను ప్ర‌క‌టించ‌డంపై అభిమానులు షాక్ కు గురైనా తాను ఆ స‌మ‌యంలో తీసుకున్న నిర్ణ‌యం స‌రైందేన‌న్నాడు. అలాగే రిటైర్ అయ్యేందుకు అదే స‌రైన స‌మ‌యం అని భావించాన‌ని, అందుక‌నే ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంట‌నే తాను కూడా రిటైర్ అయ్యాన‌ని తెలిపాడు. ధోనీకి, త‌న‌కు మ‌ధ్య చ‌క్క‌ని స్నేహం ఉంద‌ని వివ‌రించాడు.

కాగా ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ సీజ‌న్ ఆరంభంలో చెన్నై జ‌ట్టులో 13 మంది ఆట‌గాళ్లతోపాటు సిబ్బంది కోవిడ్ బారిన ప‌డ్డాక రైనా అక‌స్మాత్తుగా టోర్నీ నుంచి త‌ప్పుకున్నాడు. దుబాయ్‌లో ఓ హోట‌ల్‌లో చెన్నై జ‌ట్టు క్యాంప్ చేయ‌గా, అందులో రైనాకు ఇచ్చిన గ‌ది బాగాలేద‌ని అత‌ను టీం మేనేజ్‌మెంట్‌తో గొడ‌వ‌ప‌డ్డాడ‌ని, అందుక‌నే టోర్నీ నుంచి త‌ప్పుకున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ వాటిని రైనా కొట్టిపారేశాడు. త‌న బంధువు ఒకరికి ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డం వ‌ల్లే టోర్నీ నుంచి త‌ప్పుకున్నాన‌ని తెలిపాడు. అయితే వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో చెన్నై త‌ర‌ఫున రైనా ఆడ‌తాడా, లేదా అనేది సందేహంగా మారింది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న ఐపీఎల్ 2021 వేలంపాట ప్లేయ‌ర్ల జాబితాలో రైనా పేరు ఉంటుందా, ఉండ‌దా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version