స్విగ్గీ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న 125 టైర్-1, టైర్-2 సిటీల్లో కిరాణా సరుకులను డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు స్విగ్గీ ఒక ప్రకటన విడుదల చేసింది. వినియోగదారులు సరుకులను ఆర్డర్ చేశాక.. కేవలం 2 గంటల్లోనే వాటిని వారి ఇంటికి డెలివరీ ఇవ్వనున్నట్లు స్విగ్గీ తెలియజేసింది.
కాగా స్విగ్గీ.. కిరాణా సరుకులను డెలివరీ చేసేందుకు గాను హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, గోద్రెజ్, డాబర్, మరికో, సిప్లా, విశాల్ మార్ట్, అదానీ విల్మర్స్ తదితర కంపెనీలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో తమ యాప్‌లో ప్రత్యేకంగా గ్రాసరీ అనే ట్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశామని స్విగ్గీ తెలిపింది. అయితే వినియోగదారులు నో-కాంటాక్ట్ డెలివరీ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చని స్విగ్గీ సూచించింది. ఈ క్రమంలో వినియోగదారులు ఒక్కసారి సరుకులను ఆర్డర్ చేశాక.. వారికి స్విగ్గీ కాల్ చేసి ఆర్డర్‌ను కన్‌ఫాం చేసుకోనుంది. ఆ తరువాతే సరుకులను డెలివరీ ఇవ్వనుంది.
ఇక ప్రస్తుతం అమెజాన్ సహా పలు ఈ-కామర్స్ సంస్థలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా కిరాణా సరుకులను పలు నగరాల్లో డెలివరీ చేస్తున్నాయి. అయితే ఆర్డర్లు భారీగా వస్తుండడంతో ఆ తాకిడిని ఆ సంస్థలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులకు తమ సంస్థ నుంచి కిరాణా సరుకులను డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నామని.. స్విగ్గీ తెలిపింది.